ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర!
ఇంటింటికీ మందు, చికెన్
బషీరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ప్రలోభాలకు తెరలేపారు. చివరి రోజు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ఒకటి రెండు గ్రామాల్లోనే ప్రచారం చేయగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుదారుల తరఫున మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చేస్తాం అంటూ ఆయా పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేశారు. బషీరాబాద్, జీవన్గీ, మైల్వార్, పర్వత్‌పల్లి, నీళ్లపల్లి, కొర్విచెడ్ గని, ఇందర్‌చెడ్, దామర్‌చెడ్, ఎక్మాయి, బోజ్యానాయక్‌తండా, కాశీంపూర్, మంతట్టిలో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. కాగా ఐదు గ్రామాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.
బషీరాబాద్‌పైనే అందరి దృష్టి
మండల కేంద్రమైన బషీరాబాద్ పంచాయతీలో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు వెంకటేష్ మహరాజ్, అనూప్ ప్రసాద్ మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ బలమైన రాజకీయ కుటుంబాల అభ్యర్థులు కావడంతో హోరాహోరీగా పోటీ ఉండనుంది. వెంకటేష్ మహరాజ్ తరఫున మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రాకేష్ మహరాజ్, రోహిత్ మహరాజ్ ప్రచారం చేయగా, అనూప్ తరఫున మాజీ ఎంపీపీ కరుణ, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్ ప్రచారం చేశారు. జీవన్గీలో నర్సింలు, రామని బసప్ప మధ్య కూడా రసవత్తర పోటీ నెలకొంది.
వలస ఓటర్లకు గాలం
మండలానికి చెందిన సుమారు 5 వేల మంది ఓటర్ల వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని ఆకట్టుకునేందుకే అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జీపీల్లో వలస ఓట్లే అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో చివరి మూడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్, పూణే, ముంబై వంటి నగరాల్లో బతుకు దెరువు కోసం వెళ్లిన వారిని గ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి నగదుతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారిని రప్పించడానికి వాహనాలను సైతం సమకూర్చుతున్నారు.
ముగిసిన తొలివిడత ప్రచార పర్వం
చివరి రోజు హోరెత్తించిన అభ్యర్థులు
ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
వలస ఓటర్లపై నేతల ఫోకస్
అందరి దృష్టి బషీరాబాద్ ఎన్నికపైనే..
ప్రచార పర్వానికి తెరపడటంతో అభ్యర్థులు ప్రలోభాలను మొదలు పెట్టారు. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడంతో పాటు చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు. దావత్‌లు ఇస్తున్నారు. కులాలు, సంఘాల వారీగా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. దేవాలయాల నిర్మాణాలకు ప్రామిస్‌లు చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర!


