పోలింగ్ సాఫీగా సాగాలి
అనంతగిరి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికలు జరగనున్న 8 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సాఫీగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో 10వ తేదీ ఉదయం 8 గంటలకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెక్ లీస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరగాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్‌కు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సుధీర్, నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో 225 సర్పంచ్, 1,912 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. 45మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినుట్లు తెలిపారు. స్టేజ్ 2 ఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీకి కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్ సుధీర్, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా సాగాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మొదటి విడత ఎన్ని కల సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఆర్‌ఓ మంగీలాల్, డీపీఓ జయసుధ, నోడల్ ఆఫీసర్ మాధవ రెడ్డి, డీఈఓ రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ ప్రతీక్ జైన్


