హస్తం బలపరిచిన అభ్యర్థులదే గెలుపు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కుల్కచర్ల: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మల్కాపూర్‌కు చెందిన బీజేపీ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే సర్పంచులుగా గెలవనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్, వెంకటయ్య, గోపాల్, రాజేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
రైతుల కోసం ధర్నా చేస్తే కేసులా..?
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి: రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడున్నారని ప్రశ్నించినందుకు ప్రభుత్వం కేసులు అక్రమం కేసులు పెట్టడం సరికాదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌లో రైతులకు యూరియా అందడం లేదని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయనపై కేసు నమోదవడంతో సోమవారం పరిగి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి రైతులు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుందఅశోక్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సురేందర్, వెంకటయ్య రవికుమార్ పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంటికి కన్నం
● ఇద్దరు పాత నేరస్తులకు రిమాండ్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ
షాద్‌నగర్‌రూరల్: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణంలోని పీఎస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడకు చెందిన సురేందర్, తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన నర్సింలు జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు మల్లీ చోరీల బాటపట్టారు. పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే కొండె కృష్ణయ్య ఈ నెల 3న తన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం, చిన్నరేవళ్లికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కృష్ణయ్య భార్య ఇంటికి తాళం వేసి టైలర్‌షాప్‌నకు వెళ్లింది. ఇది గమనించిన సురేందర్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బంగారం, నగదు దోచుకెళ్లాడు. చోరీ విషయంపై బాధితుడు కృష్ణయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. సురేందర్ చోరీ చేసిన సొత్తును నర్సింలు కుదువపెట్టి ఇద్దరూ కలిసి జల్సాలు చేసేవారు. వీరు గతంలో ఎల్బీనగర్, మేడిపల్లి, సరూర్‌నగర్, చైతన్యపురి, బాలనగర్, చంద్రాయన్‌గుట్ట, భువనగిరి, గద్వాల, విజయనగర్, విరాకాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, తిరుపతి, సైదాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. నిందితుల వద్ద ఒక బైక్, 3.2 తులాల బంగారం, రూ.62,600 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.
సొంతింటి కల సాకారం
చేవెళ్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌లో సోమవారం సద్దుల ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి, అనంతరం వార్డులో 10లక్షల నిధులతో వేస్తున్న సీసీ రోడ్డుపనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యలను శాలువాతో సన్మానించి అభినందించారు.
హస్తం బలపరిచిన అభ్యర్థులదే గెలుపు
హస్తం బలపరిచిన అభ్యర్థులదే గెలుపు


