హస్తంతో షికారు!
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘కలిసి’పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఉప్పునిప్పులా నిత్యం విమర్శించుకునే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు బషీరాబాద్ మండలంలో స్నేహగీతం పాడుతున్నాయి. ఇదంతా గ్రామాల్లో మామూలే కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఒక సర్పంచ్ పదవి కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి ప్రయాణిస్తున్న హస్త షి‘కారు’తాండూరులో చర్చనీయాంశమైంది.
బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి విత్‌డ్రా
తాండూరు రాజకీయాలకు కేంద్రబిందువైన బషీరాబాద్ మండలంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బషీరాబాద్ సర్పంచ్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు అల్లుడు వెంకటేశ్ మహరాజ్, సొసైటీ వైస్‌చైర్మన్ అజయ్‌ప్రసాద్ అన్న కొడుకు అనూప్ ప్రసాద్ తలపడుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి అబ్దుల్ రజాక్‌ను తప్పించారు. దీంతో పోటీలో ఉన్న ఇద్దరునేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బషీరాబాద్ మండలంలో తమ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తన బాబాయి శ్రీశైల్‌రెడ్డి, ముఖ్య నాయకులతో కలిసి హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.
‘కలిసి మెలిసి’ సహకారం
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు అల్లుడు వెంకటేశ్ మహరాజ్ విజయానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పైలెట్ రోహిత్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడి నుంచే బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పైలెట్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో తన నానమ్మ పంజుగుల శంకరమ్మ ఇందర్‌చెడ్ సర్పంచ్‌గా పోటీ చేస్తే ఆమె విజయానికి తాము మద్దతు ఇచ్చినట్లు నారాయణరావు గుర్తు చేశారు. అందేకే తాము ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వెంకటేశ్‌కు సహకారం అందిస్తున్నట్లు రోహిత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇదే సమాయానికి అక్కడికి చేరుకున్న విలేకర్లను ఉద్దేశించి ఇరువురు నేతలు స్పందించారు. తాము రాజకీయ పార్టీలు వేరైనా ఒక్క మండలానికి చెందిన వారమని, తమకు కుంటుంబ సబంధాలు ఉన్నాయంటూ పైలెట్ చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మర్యాదపూర్వక భేటీనే..
ఇద్దరు ఒకే మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మర్యాద పూర్వదకంగా కలిసి మాట్లాడుకున్నారని మహరాజుల కుటుంబం మీడియాకు వివరణ ఇచ్చింది. బషీరాబాద్ ఎప్పుడు వచ్చిన రోహిత్‌రెడ్డి నారాయణరావు ఇంటికి వచ్చి పలకరిస్తుంటారని రోహిత్ మహరాజ్ చెప్పారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని ‘సహకారం’వ్యవహారాన్ని దాటవేశారు.
బషీరాబాద్‌లో ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్
మహరాజులతో మాజీ ఎమ్మెల్యే చెట్టా పట్టాల్
సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపిన రోహిత్‌రెడ్డి
వెంకటేశ్‌మహరాజ్ విజయానికి బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు
చర్చనీయాంశమైన మాజీల ‘సహకార రాజకీయం’
హస్తంతో షికారు!


