ఐదేళ్లకు.. అమ్మదయ
భూదాతను వరించిన సర్పంచ్ పదవి
● ఏకగ్రీవానికి తీర్మానించిన మక్తవెంకటాపూర్ గ్రామస్తులు
కుల్కచర్ల: పంచాయతీ ఎన్నికల్లో ఓ వైపు విచిత్రమైన పొత్తులు పొడుస్తుండగా.. మరో వైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ పలు గ్రామాల పెద్దలు తీర్మానిస్తున్నారు. చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్ పంచాయతీ పరిధిలో గతేడాది అమ్మవారు, సేవాలాల్ ఆలయాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాల నిర్మాణానికి గ్రామానికి చెందిన జరుప్ల కవిత కుటుంబీకులు ఐదేళ్ల క్రితం 26 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చారు. ఆసమయంలో గ్రామస్తులు మీ కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని మాటిచ్చారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. గ్రామ నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కవిత తనను ఏకగ్రీవం చేయాలని కోరింది. దీంతో గ్రామ పెద్దలు ఆయా పార్టీల నాయకులతో మాట్లాడి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో సోమవారం కవిత మినహాయిస్తే మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నేడు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


