వాట్సాప్‌లో ఎన్నికల విధులు
● అయోమయంలో సిబ్బంది
● ఎంపీడీఓలపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
అనంతగిరి: పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది ఉత్తర్వుల జారీలో ఎంపీడీఓలు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ వెంకటర్నం, ఎ.రాములు అన్నారు. ఈ మేరకు సోమవారం వారు అదనపు కలెక్టర్ సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ.. ఎంపీడీఓలు ఎన్నికల ఉత్తర్వులను సంబంధిత సిబ్బందికి వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారని చెప్పారు. ఒక్కో ఉద్యోగికి ఒకే విడతలో మూడు, నాలుగు మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించడంతో వారు అయోమయంలో పడుతున్నారన్నారు. ఎన్నికల సిబ్బందికి ఆయా మండలాల అభివృద్ధి అధికారులు శిక్షణ కేంద్రాల్లో సరియైన భోజన వసతులు కల్పించలేక పోతున్నారన్నారు. ఆరు నెలల లోపు సర్వీసు నుంచి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులను, దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరగా జిల్లా పంచాయతీ అధికారి జయసుధకు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దశరథ్, అరవింద్, రాములు, శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.


