విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి
రామకృష్ణ మఠం భావ ప్రచార రాష్ట్ర కన్వీనర్ సూర్యప్రకాశ్
తాండూరు టౌన్: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి శ్రీరామకృష్ణ సేవా సమితి తన వంతు కృషి చేస్తుందని రామకృష్ణ మఠం భావ ప్రచార రాష్ట్ర కన్వీనర్ సూర్యప్రకాశ్ అన్నారు. ఆదివారం త్వరలో నిర్వహించనున్న నవోదయ ఎంట్రన్స్ పరీక్ష మోడల్ టెస్ట్‌ను పట్టణంలోని ఓ కళాశాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 61 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరీక్షల పట్ల అంతర్గతంగా దాగి ఉన్న భయాందోళనలు పోగొట్టేందుకే నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించామన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 100 రోజుల పాటు విద్యార్థులకు ఉచితంగా నవోదయ ఎంట్రన్స్ పరీక్షకు కోచింగ్ ఇచ్చామన్నారు. విద్యార్థులు ఎలాంటి భావోద్వేగానికి, భయానికి లోనవకుండా ఎంట్రన్స్ పరీక్ష రాసి, నవోదయలో సీట్లు సాధించాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా బోధించిన శాంతప్ప, వీరేశం గౌడ్, ఆంజనేయులు, రవీందర్, వెంకటస్వామిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో సేవా సమితి తాండూరు అధ్యక్షుడు బాలకృష్ణ, నిర్వాహకులు కృష్ణయ్య, గౌరవాధ్యక్షుడు బస్వరాజ్, సభ్యులు మోహన్ రెడ్డి, నరహరి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


