 
															శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
● పోలీసు అమరులను స్మరించుకోవాలి
● ఏసీపీ జానకీ రెడ్డి
పహాడీషరీఫ్: శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని మహేశ్వరం డివిజన్ ఏసీపీ జానకీ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా సోమవారం పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఇన్‌స్పెక్టర్లు ఎం.సుధాకర్, ఎస్.రాఘవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. భారత్ చైనా యుద్ధంలో అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయిన సైనికులు, దేశంలోని అంతర్గత భద్రత కల్పించే విషయంలో అసువులు బాసిన పోలీసులను గుర్తుకు చేసుకునేందుకు ఏటా అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21 నుంచి 31 వరకు రోజుకో రీతిలో సంస్మరణోత్సవాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌజ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, బైక్, సైకిల్ ర్యాలీలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో పహాడీషరీఫ్ ఎస్‌ఐలు బి.దయాకర్ రెడ్డి, వి.లక్ష్మయ్య, ఎల్.వెంకటేశ్వర్లు, ఫైజల్ అహ్మద్, బాలాపూర్ ఎస్‌ఐలు కె.సుధాకర్, ఎం.నవీన్ కుమార్, ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్, మహ్మద్ సొహేల్, ఎస్.కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
