 
															అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు
● ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
● ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్
● విద్యా సంస్థల బంద్ ప్రశాంతం
తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా విద్యార్థులకు రావాల్సిన రూ.8,150 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. దీంతో కోర్సులు పూర్తయిన విద్యార్థులు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని పేర్కొన్నారు. వెంటనే బకాయి నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేష్, ముబీన్, సాయి, చరణ్, శివశంకర్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
