 
															పల్లెలపై ఫోకస్ పెట్టండి
● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
● బాల్య వివాహాలను అరికట్టాలి
● ఎస్పీ నారాయణరెడ్డి
తాండూరు రూరల్: త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఆవరణలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎస్‌హెచ్‌ఓ గది, హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం స్టేషన్ రికార్డులు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. పోలీసుల వద్ద ప్రతి గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణం తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని అరికట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించరాదన్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పెద్దేముల్, తాండూరు, మల్‌రెడ్డిపల్లి, నవాబుపేట పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ డ్రోన్ల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారని విలేకరులు ఎస్పీ దృష్టికి తేగా అవి డ్రోన్లు కాదని విమాన రాకపోకలని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో సిగ్నల్ ఆలస్యం కావడంతో ఈ ప్రాంతాల్లో తిరిగి మళ్లీ వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందరాదని సూచించారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
