 
															కొనుగోళ్లు లేక.. ఆదాయం రాక
తాండూరు: ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పెసర, మినుము పంటలకు వాతావరణం అనుకూలించక పోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత సీజన్‌లో భారీ వర్షాలు కురవడంతో స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము దిగుబడులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏటా వేల క్వింటాళ్ల ఉత్పత్తులతో కళకళలాడే తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఈ సారి వెలవెలబోయింది. గతేడాది పంట ఉత్పత్తులకు ధరలు బాగా పలికాయి. ఈ సారి ఆ పరిస్థితి లేదు. భారీ వ్యత్యాసం కనిపించింది.
ఆశించిన స్థాయిలో జరగని కొనుగోళ్లు
తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు మూడేళ్లుగా పెసర, మినుము పంటల ఉత్పత్తుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. రెండేళ్ల క్రితం వరకు సీజన్ వచ్చిందంటేనే యార్డు మొత్తం పెసర, మినుము ఉత్పత్తులతో నిండిపోయేది. ఈ సారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుత సీజన్‌లో 9,760 క్వింటాళ్ల పెసర కొనుగోళ్లు జరిగాయి. క్వింటాలుకు గరిష్ట ధర రూ.6,805, కనిష్ట ధర రూ.3,501, సగటు ధర రూ. 4671 చొప్పున పలికాయి. మినుములు 4,155 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. క్వింటాలుకు గరిష్ట ధర రూ.6,000, కనిష్ట ధర రూ.4,500, సగటు ధర రూ.5,209 చొప్పున పలికాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి మార్కెట్ ఆదాయం రూ.60 లక్షలకు పైగా తగ్గిందని అధికారులు తెలిపారు.
మద్దతు ధర కరువు
పెసర ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో క్వింటాలుకు రూ.8,768 మద్దతు ధర నిర్ణయించారు. మినుములు క్వింటాలుకు రూ.7,800 నిర్ధారించింది. అయితే ఈ సీజన్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులలో కొనుగోలు చేసిన పెసర మినుము ఉత్పత్తులకు రైతులకు మద్దతు ధర అందడం లేదు.
కళ తప్పిన తాండూరు మార్కెట్
ఈ సీజన్‌లో పెసర 9,760 క్వింటాళ్లు..
మినుము 4,155 క్వింటాళ్ల కొనుగోళ్లు
గత ఏడాదితో పోలిస్తే
రూ.60 లక్షలకు పైగా తగ్గిన ఆదాయం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
