 
															ఆదమరిస్తే.. అంతే!
నవాబుపేట: ట్రాన్స్ ఫార్మర్లను చెట్ల పొదలు అల్లుకుంటున్నాయి. విద్యుత్ వైర్లకు పొదలు తగిలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గుల కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గృహోపకరణాలు పాడువుతన్నాయి. పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకుని ఇళ్లు కాలిబూడిదవుతున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పునరుద్ధరణకు తిప్పలు
మండల పరిధిలోని గొల్లగూడ, ఎల్లకొండ, పులుమామిడి, మైతాప్‌ఖాన్‌గూడ, అక్నాపూర్, గంగ్యాడ, మాదారం తదితర గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చెట్ల పొదలు పెరిగాయి. ఇవి విద్యుత్ తీగలకు చుట్టుకుని ఉన్నాయి. కాగా గాలి వీచిన ప్రతీసారి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గాలి ఎక్కువగా వీచిన సమయాల్లో మంటలు చెలరేగుతున్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కనీసం ఒక రోజు వరకు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం
గతంలో పలుగ్రామాల్లో చెట్ల పొదలు తొలగించి సమస్య పరిష్కరించాం. మరికొన్ని గ్రామాల్లో పరిష్కరించాల్సి ఉంది. ప్రస్తుతం విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్నాం. త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలను పరిశుభ్రం చేస్తాం.
– శ్రీకాంత్‌రెడ్డి, ఏఈ, నవాబుపేట
చెట్ల పొదలు పెరిగి ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
చిన్నపాటి గాలిదుమారానికే
పంపిణీ నిలిపివేస్తున్న అధికారులు
ఆందోళనలో ప్రజలు
 
							ఆదమరిస్తే.. అంతే!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
