 
															పంచాయతీల్లో నిధుల కటకట
● కుంటుపడుతున్న అభివృద్ధి
● మరమ్మతుకు నోచుకోని చేతిపంపులు
దౌల్తాబాద్: పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదలవకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు వాపోతున్నారు. సమస్యలను పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు మినహాయిస్తే ఇతర నిధులు మంజూరు చేయకపోవడంతో తాము చేతి నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
పది నెలలుగా పెండింగ్
మండల పరిధిలో 33 గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ఆయా పంచాయతీ కార్యదర్శి అత్యవసర సమయంలో అప్పు చేసి రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు పెట్టినా డబ్బులు విడుదల చేయకుండా తిరస్కరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు తాండవం
మండల వ్యాప్తంగా గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. సర్పంచ్‌ల పాలన ముగియడం ప్రత్యేకాధికారును కేటాయించడంతో గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రత్యేకాధికారులు పని ఒత్తిడికి లోనవడంతో పర్యటించడమే లేదంటున్నారు. దీంతో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, రోడ్లపై చెత్తపేరుకుపోవడం, నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పల్లె ప్రకృతి వనాలు వట్టిపోయి దర్శనమిస్తున్నాయి. నర్సరీల నిర్వహణ తూతూ మంత్రంగా కొనసాగుతోంది.
నిధుల మంజూరులో జాప్యం
గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హమీ పనులతో పంచాయతీ కార్యదర్శులకు పని భారం పెరిగింది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. అత్యవసరం ఉన్న చోట అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తున్నాం.
– శ్రీనివాస్, ఎంపీడీఓ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
