 
															విద్యతోనే సమాజ వృద్ధి
కొడంగల్: విద్యతోనే సమాజం వృద్ధి చెందుతుందని మున్నూరు కాపు రాష్ట్ర మహా సభ మాజీ ఉపాధ్యక్షుడు నిమ్మ శంకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని కాచిగూడ మున్నూరు కాపు భవన్‌లో కొడంగల్‌కు చెందిన విద్యార్థిని బాకారం నాగలక్ష్మికి (వెటర్నరీ సైన్స్) చదువు నిమిత్తం రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తన సంపాదనలో కొంత మొత్తం ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పారు. మున్నూరు కాపు రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలన్నారు. కుల బంధువులు ఐక్యంగా ఉండాలని సూచించారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయంగా అభివృద్ది చెందాలన్నారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్‌షిప్పులు, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఏడాది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. పేదింటిలో పెళ్లి ఉంటే పుస్తెమట్టెలు ఇస్తున్నట్లు చెప్పారు. కొడంగల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు కుల బంధువులందరూ కుటుంబ సభ్యులేనని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు కొండూరు వినోద్ కుమార్, సభ్యులు దత్తు మూర్తి, శ్రీకాంత్, రమేశ్, కేఎస్ ఆనంద్‌కుమార్, శ్రీనివాస్‌రావు, సంఘం కోశాధికారి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు రమేశ్, అరిగె ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు శంకర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
