 
															జైన విగ్రహాలను పరిరక్షిస్తాం
నవాబుపేట: మండలంలోని ఎల్లకొండ శివపార్వతుల ఆలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం ఆలయాన్ని సందర్శించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందేళ్లనాటి విగ్రహాలను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో జైన మతస్థులు లేకపోవడంతో విగ్రహాలు పూజకు నోచుకోకపోవడం లేదన్నారు. ఈ విగ్రహాల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైదరాబాద్‌కు తరలిస్తే బాగుంటుందని తెలిపారు. ఇందుకు స్థానికులు అంగీకరించలేదు. అతి పురాతన దేవాలయం అయినందున విగ్రహాలను తరలించరాదని కోరారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. గ్రామస్తుల అభిప్రాయం మేరకు విగ్రహాలను ఇక్కడే ఉంచి పూజలు జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం గ్రామ పరిసరాల్లోని పురాతన ఆలయాన్ని పరిశీలించారు. కార్యక్రమమలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ బుచ్చయ్య, ఆలయ చైర్మన్ పటోళ్ల భరత్‌రెడ్డి, మాజీ సర్పంచులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గ్రామ పెద్దలు సంతోకుమార్, కొండయ్య, మాణిక్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
