 
															చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
పరిగి: విద్యార్థి దశ నుంచే చట్టాల గురించి తెలుసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానంలో నిలుస్తారని తెలిపారు. విద్య అందరి హక్కు అన్నారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడటం నేరమన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్‌కృష్ణ, న్యాయవాది నరేంద్ర యాదవ్, లీగల్ ఎయిడ్ న్యాయవాదులు వెంకటేష్, రాములు, గౌస్ పాషా, స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
