 
															సైబర్ మోసాలతో జాగ్రత్త
● డ్రగ్స్‌పై ఉక్కుపాదం
● శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
● సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
చేవెళ్ల: సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శనివారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు, పోలీస్‌స్టేషన్ పనితీరును పరిశీలించారు. 551 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ నగరాలకే కాదు గ్రామీణ స్థాయికి సైతం విస్తరించిందని, దీనిపై పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రజల్లో ఇంకా అవగాహన అవసరమని, సైబర్‌మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు రక్షణతోపాటు క్రైమ్ రేట్‌ను తగ్గించేందుకు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. సైబరాబాద్ పరిధిలో దాదాపు వెయ్యికిపైగా ఫాంహౌస్‌లు ఉన్నాయని, వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల పలు కేసులు నమోదు చేసి 90 శాతం ఛేదించినట్టు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వివరించారు. చేవెళ్లలో కమాండ్‌కంట్రోల్ రూమ్ తరహాలో మండల కేంద్రంతోపాటు మండలంలోని 21 గ్రామాల్లో కలిపి 551 సీసీ కెమెరాలను, 12 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను స్థానికుల సహకారంతో ఏర్పాటుచేయడం హర్షణీయమని అన్నారు. ఇన్‌స్పెక్టర్ భూపాల్ శ్రీధర్, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, అదనపు డీసీపీ కె.శ్రీనివాస్‌రావు, చేవెళ్ల ఏసీపీ కిషన్, డీఐ జె.ఉపేందర్, ఎస్‌ఐలు సంతోష్‌రెడ్డి, వనం శిరీష, తేజశ్రీ, బి.శీరీష తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
