 
															వణికించిన వరుణుడు
వరదనీటిలో జారిపడిన బైక్
లక్డీకాపూల్: నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కారణంగా నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. చలిగాలులతో పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, మోజంజాహీ మార్కెట్, అబిడ్స్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం ఏర్పడింది. శేరిలింగంపల్లి చందానగర్‌లో అత్యధికంగా 5.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వరద నీటితో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఒకవైపు గుంతలు తేలిన రోడ్లు.. మరోవైపు వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. రోజంతా చినుకులు కురుస్తూనే ఉండటంతో వీధి వ్యాపారులు, సహా అత్యవసర పనులపై బయటికి వెళ్లిన వారు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు.
 
							వణికించిన వరుణుడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
