 
															గతాన్ని మరచి ముందుకు సాగండి
● శాంతిభద్రతలకు
విఘాతం కలిగిస్తే చర్యలు
● సీఐ వేణుగోపాల్‌రావు
మాడ్గుల: ‘నేర ప్రవృత్తిని మార్చుకోవాడానికి అవకాశం ఇస్తున్నాం. గతాన్ని మరచి, మంచి మనసుతో ముందుకు సాగాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీఐ వేణుగోపాల్‌రావు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. బుధవారం మండలంలోని పలువురు సస్పెక్ట్ రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. వారి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేర చరిత్ర ఉన్న వారి మార్పు కోసం ఈ సోదాలు నిర్వహించామని తెలిపారు. భూ కబ్జాలు, ప్రజలను భయ పెట్టడం, ఆస్తులు ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
