
సదరం.. ఆలస్యం
డీఆర్డీఏ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖల మధ్య సఖ్యత లేకపోవడమే కారణం కలెక్టర్ వద్దకు చేరిన పంచాయితీ ప్రత్యేక పరీక్షల కోసం దివ్యాంగుల ఎదురుచూపులు
రెండు నెలలుగా శిబిరాల ఊసెత్తని అధికారులు
వికారాబాద్: రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదం ప్రత్యేక ప్రతిభావంతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో ప్రతినెలా 13 సదరం క్యాంపులు నిర్వహించాల్సి ఉన్నా రెండు నెలలుగా నిలిచిపోయాయి. దాదాపు 700 మందికి పైగా దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యం కలిగిన వారు పింఛన్లు, బస్ పాస్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందా లంటే సదరం సర్టిఫికెట్ తప్పని సరి.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. దివ్యాంగులు ఆన్‌లైన్ ద్వా రా దరఖాస్తు చేసుకుంటే వాటిని క్రోడీకరించి ప్రతివారం శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సంబంధిత వైద్య నిపుణులతో పరీక్షలు చేయించి వైకల్యం ఆధారంగా సర్టిఫికెట్లు అందజేస్తారు. కొత్త సర్టిఫికెట్లతోపాటు పాత వాటిని రెన్యువల్ చేయా ల్సి ఉంటుంది. అయితే పై రెండు శాఖల అధికారుల మధ్య సఖ్యత లేకపోవడంతో సదరం ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు క్యాంపుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో వాదన
సదరం క్యాంపుల నిర్వహణపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్యాంపుల తేదీ ఇవ్వడం లేదని డీఆర్డీఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఒకసారి తేదీలు ఇచ్చినా వైద్యులను కేటాయించలేదని పేర్కొన్నారు. ఇదేమని అడిగితే నాతో మాట్లాడే స్థాయి మీది కాదని అన్నట్లు తెలిపారు. అంతేకాకుండాశిబిరాలపై చర్చించడానికి సమయం కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ వాదన మరోలా ఉంది. డీఆర్డీఏ ఉద్యోగులు నెల రోజుల క్రితం తనను కలిశారని, క్యాంపుల నిర్వహణకు తేదీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం శిబిరాలు ఏర్పాటు చేద్దామని డీఆర్డీఏ ఉద్యోగులకు చెప్పినట్లు తెలిపారు. తాను బాధ్యతాయుతంగా కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.