
వారి త్యాగాలు మరువలేనివి
అనంతగిరి: పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని పేర్కొన్నారు. వారి బలిదానం దేశానికే గర్వకారణమని కొనియాడారు. పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని, సమాజ భద్రత, శాంతిని కాపాడటంలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. జిల్లా పరిపాలనలో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకమన్నారు. ప్రజల తరఫున అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడుతూ, చట్టాన్ని అమలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర పోలీసుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే మహత్తర అవకాశంగా భావించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మన జవాన్లు చేసిన, చేస్తున్న కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. వారి నిస్వార్థ సేవ, త్యాగాలు జిల్లా పోలీసులకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
నివాళుర్పిస్తున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్,
ఎస్పీ నారాయణరెడ్డి, ఇతర అధికారులు