భారీ ప్రక్షాళన | - | Sakshi
Sakshi News home page

భారీ ప్రక్షాళన

Jul 20 2025 3:19 PM | Updated on Jul 21 2025 5:07 AM

భారీ ప్రక్షాళన

భారీ ప్రక్షాళన

జిల్లాలో 35 మంది ఎస్‌ఐల బదిలీ

వికారాబాద్‌: పోలీసు శాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఏకంగా 35మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. మెజార్టీ పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలను మారుస్తూ కొత్తవారికి పోస్టింగ్‌ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీ సంఖ్యలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 21 పోలీస్‌ స్టేషన్లు ఉండగా ఇందులో వికారాబాద్‌, తాండూరు, వికారాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారులు ఎస్‌హెచ్‌ఓలుగా కొనసాగుతున్నారు. మిగతా 18 స్టేషన్లకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారులు ఎస్‌హెచ్‌ఓలుగా ఉంటున్నారు. వీరి స్థానంలో ప్రొబెషనరి పీరియడ్‌ పూర్తి చేసుకున్న 2024 బ్యాచ్‌కు చెందిన 12 మంది ఎస్‌ఐలకు పోస్టింగ్‌ ఇచ్చారు. మిగతా ఆరు స్టేషన్లలో కూడా కొత్త వారే రెండు నెలల క్రితం పోస్టింగ్‌ తీసుకున్నారు. దీంతో సీఐలు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న స్టేషన్లు మినహా జిల్లాలోని 18 పోలీస్‌ స్టేషన్లలో కొత్తవారినే నియమించినట్టయ్యింది. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు వీరు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా..

సీఐలు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న మూడు పోలీస్‌ స్టేషన్లు మినహా మిగిలిన 18 స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా కొత్తవారిని నియమించటం ద్వారా ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కొంతకాలంగా జిల్లాలోని పలువురు ఎస్‌హెచ్‌ఓలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, ఇసుక దందాల్లో తలదూర్చినట్లు విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో అంటకాగుతూ వస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇలాంటి వారిని ఎస్‌హెచ్‌ఓలుగా తప్పిద్దామంటే ప్రజా ప్రతినిధుల అండదండలతో అవే పోస్టుల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐలుగా ఎంపికై ప్రొబెషనరీ పీరియడ్‌ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్‌ ఇవ్వాలనే నిబంధన ఉండటంతో 2024 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలకు అవకాశం కల్పించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పాతవారందరినీ మారుస్తూ జిల్లాలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో కొత్తవారికి అవకాశం కల్పించారు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందగా అధికారులు వ్యవహరించారు.

మహిళా ఎస్‌ఐలకు పెద్దపీట

ప్రస్తుత బదిలీల్లో మహిళా ఎస్‌ఐలు జాక్‌పాట్‌ కొట్టారు. జిల్లా చరిత్రలో మొదటి సారి నాలుగు పీఎస్‌లకు మహిళా ఎస్‌ఐలు ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. వికారాబాద్‌ జిల్లాగా ఏర్పాటు కాకముందు నుంచే పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని 20 ఠాణాలతో వికారాబాద్‌లో ఎస్సీ కార్యాలయం ఉండేది. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో వికారాబాద్‌ జిల్లాలో నలుగురికి మాత్రమే ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు అప్పగించారు. ఇందులో లక్ష్మిమాధవి నవాబుపేట ఎస్‌ఐగా, వికారాబాద్‌ ఎస్‌ఐగా పురుషులకు దీటుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి శభాష్‌ అనిపించుకున్నారు. అనంతరం హర్ష భార్గవి ధారూరు ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు. వీరు మాత్రమే జనరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పని చేయగా మరో ఇద్దరు ప్రమీల, రేణుకారెడ్డి మహిళా పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌ఓలుగా విధులు నిర్వహించారు. ఓవరాల్‌గా చూస్తే ఈ నలుగురు మాత్రమే గడిచిన ఇరవై ఏళ్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పని చేశారు. ఇదే విషయమై ఇటీవల సాక్షి దినపత్రికలో ఎందుకీ వివక్ష అనే శీర్షికన కథనం ప్రచురితమైన వారంలోపే ఒకరికి, నెల లోపు మరొకరికి ప్రస్తుత ఎస్పీ నారాయణరెడ్డి ఎస్‌హెచ్‌ఓలుగా అవకాశం కల్పించారు. తాజాగా ఇచ్చిన పోస్టింగుల్లో మరో ఇద్దరు మహిళా ఎస్‌ఐలకు ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం బంట్వారం, కోట్‌పల్లి, కొడంగల్‌, కరణ్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్లలో మహిళా ఎస్‌ఐలు ఎస్‌హెచ్‌ఓలుగా కొనసాగనున్నారు. ఇదే సమయంలో జిల్లా నుంచి కీలక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాలో పర్యవేక్షణాధికారులుగా ఉన్న సీఐలు, డీఎస్పీలు సైతం మహిళా ఎస్‌ఐల విధి నిర్వహణకు సహకరించాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

12 మంది ఎస్‌హెచ్‌ఓలకు స్థానచలనం అన్ని పోలీస్‌ స్టేషన్లలో కొత్త ముఖాలే మొదటిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నలుగురు మహిళా ఎస్‌ఐలు స్థానిక ఎన్నికలు ముగిసే వరకుపోస్టింగుల్లో కొనసాగే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement