
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
● శ్రీవారి నిజరూప దర్శనం ● విశేష అలంకరణలో స్వామివారు ● తిరుమల అర్చకుల ఆధ్వర్యంలో పూజలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి అంకురార్పణ చేశారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుల్లో ఒకరైన వైఖానస ఆగమ శాస్త్ర ముఖ్య సలహాదారులు దివంగత సుందర వరద భట్టాచార్యుల కుమారుల ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి 7 గంటలకు ఆచార్య వచణం, సేనాధిపతి ఉత్సవం, మత్సం గ్రహణం, అంకురార్పణం, వేదారంభంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారి మూలమూర్తికి, అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. బాలాజీనగర్‌లోని శ్రీవారి ఆలయం నుంచి సేనాధిపతి ఉత్సవం ఊరేగింపుగా బయలు దేరి శాంతినగర్ కాలనీలోని పారువేట మంటపానికి చేరుకుంది. అక్కడ ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వరహాస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వచ్చి పూజలు చేశారు.
నిజరూప దర్శనం
పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి వారు నిజ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిత్య పూజలు, కై ంకర్యాలు జరిగాయి. విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనే, నెయ్యి, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మూడు రోజులపాటు హోమాలు
ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు యాగశాలలో హోమాలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రాత్రి 7నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 9గంటలకు ఉత్సవ మూర్తులకు శత కళశ తిరుమంజనం, మధ్యాహ్నం 12గంటలకు అగ్ని ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ, రాత్రి 7గంటలకు కుంభావాహన, విశేష హోమాలు, సోమవారం ఉదయం 9గంటలకు విశేష ఉక్త హోమాలు, పవిత్ర సమర్పణ, రాత్రి 8గంటలకు విశేష హోమాలు, మంగళవారం ఉదయం 9గంటలకు విశేష హోమాలతో పాటు పవిత్రోత్సవం, అష్టోత్ర శత అష్టదళ పద్మారాధన, పవిత్రోత్సవ మహా పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు కుంభ బింబ ప్రదక్షిణం, ప్రోక్షణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

పవిత్రోత్సవాలకు అంకురార్పణ