
‘రియల్’ మబ్బులు..!
మూడేళ్లుగా ఆగిన భూముల క్రయవిక్రయాలు
● అగ్రిమెంట్ల వద్దే నిలిచినకొనుగోళ్ల ప్రక్రియ ● రోజురోజుకూ పడిపోతున్న రిజిస్ట్రేషన్లు ● ఆందోళనలో వ్యాపారులు, రైతులు
మోమిన్‌పేట: మూడేళ్లుగా రియల్ వ్యాపారం డీలా పడింది. గతంలో మూడుపూలు ఆరుకాయలుగా విరాజిల్లిన ఈ దందా ప్రస్తుతం నెమ్మదించింది. పలువురు వ్యాపారులు అప్పులు చేసి భూములు కొనుగోలు చేశారు. మరి కొందరు అగ్రిమెంట్ల చేసుకొని మిన్నకుండి పోయారు. గతంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 40కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఒక్కో రోజు స్లాట్ దొరికే పరిస్థితి కూడా ఉండేది కాదు. ప్రస్తుతం రోజుకు పది కూడా దాటడం లేదు. అవి కూడా రెండు మూ డు కుంటలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నాలుగైదు ఏళ్ల క్రితం వరకు ఎకరం భూమి రూ.లక్షల్లో పలికేది. మూడేళ్ల నుంచి రూ.కోట్లకు చేరుకుంది. అయినా రియల్ వ్యాపారం బాగుండటంతో కొంత మంది వ్యాపారులు అప్పులు చేసి సిండికెట్‌గా ఏర్పడి భూములు కొనుగోలు చేశారు. రెండేళ్ల నుంచి రియల్ దందా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక.. వ్యాపారం సాగక ఏం చేయాలో తెలియక హైరానా పడుతున్నారు. అగ్రిమెంట్ల వద్దే ప్రక్రియ నిలిచిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా అగ్రిమెంట్ చేసుకుంటే నిర్ణీత గడవులోగా డబ్బు చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుండా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందనే ఆశతో చాలా మంది అగ్రిమెంట్ చేసుకొని భూ యజమానులకు రూ.లక్షలు అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. ప్రస్తుతం రియల్ వ్యాపారం లేకపోవడంతో మిగిలిన డబ్బు చెల్లించి భూమి కొంటే నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. గతంలో మండలంలో రియల్ భూం అందనంత ఎత్తుకు వెళ్లింది. పెట్టిన పెట్టుబడికి మూడు నుంచి నాలుగు వందల రెట్ల లాభాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం ఎన్కతల గ్రామంలో 852 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ కంపెనీ కోసం ప్రభుత్వం భూమిని సేకరించింది. దీంతో ఈ ప్రాంత భూములకు రెక్కలు వచ్చాయి.
111 జీఓ ఎత్తివేయడంతో..
మూడేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 111 జీఓను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించడంతో రియల్ దందా ఒక్కసారిగా కుదేలైంది. వెంచర్లు ఏర్పాటు చేసిన చాలా గ్రామాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అప్పట్లో మండలంలోని ఏ గ్రామంలోనైనా రోడ్డు పక్కన ఎకరా రూ.కోటిపైనే పలికింది. మోమిన్‌పేట – శంకర్‌పల్లి రోడ్డు పక్క ఎకరం రూ.4 కోట్ల పైమాటే. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రియల్ దందా పుంజుకుంటుందని చాలా మంది వ్యాపారులు భావించారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. మూడేళ్ల క్రితం ఎన్కతలలో ప్రభుత్వం భూమిని సేకరించింది. దీన్ని టీజీ ఐఐసీ రూ.45 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. రెండు నెలల నుంచి మౌలిక వసతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ భూం తిరిగి ఊపందుకుంటుందని వ్యాపారులు, రైతులు భావిస్తున్నారు.