
విచ్చలవిడిగా గడ్డిమందు!
దుద్యాల్: ప్రభుత్వం నిషేధించిన కలుపు నివారణ మందులను తెలిసీతెలియక కొంతమంది రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటక నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా సైతం విక్రయిస్తుండటంతో పత్తి, మొక్కజొన్న, వరి, కంది తదితర పంటలు సాగు చేసిన రైతులు గడ్డిని నియంత్రించేందుకు విరివిగా నిషేధిత మందును వినియోగిస్తున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉండటంతో అలవోకగా తెచ్చుకుంటున్నారు. మన జిల్లాలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్, యాలాల, బషీరాబాద్, తాండూరుతోపాటు నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, దామరగిద్ద, ఉట్కూర్, నారాయణపేట తదితర మండలాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. గరిష్టంగా 40 కిలోమీటర్లలోపు దూరం ఉండటంతో ఇలా వెళ్లి అలా తెచ్చేస్తున్నారు. కొంతమంది దళారులు వీటిని రైతులకు తీసుకువచ్చి ఇస్తున్నారు. స్ప్రే చేసిన కొద్ది గంటల్లోనే గడ్డి పూర్తిగా మాడిపోతుండటంతో రైతులు వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
గడ్డి మందుతో దుష్ఫలితాలు
● గడ్డి మందును పంటల్లో పిచికారీ చేయడం ద్వారా భూమి సహజత్వాన్ని కోల్పోతుంది.
● నేలలు నిస్సారవంతంగా మారి పంటలు ఎదగవు, దిగుబడులు పూర్తిగా పడిపోతాయి.
● మందు స్ప్రే చేసిన గడ్డిని మేస్తే పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయే ప్రమాదం ఉంది.
● గడ్డిమందు పిచికారీ చేసే రైతులు శ్వాసకోస వ్యాధులతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ.
జిల్లాలో జోరుగా నిషేధిత కలుపు మందుల వినియోగం
కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం
దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తప్పవంటున్న పర్యావరణవేత్తలు