
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
యాలాల: మండల పరిధిలోని హాజీపూర్ గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సోమవారం హాజీపూర్ గ్రామానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్యతో కలిసి బాధిత రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోరేపల్లికి చెందిన కోటం శ్రీనివాస్‌కు చెందిన పొలాన్ని ఏడేళ్లుగా రవి కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడన్నారు. గత నెల 17న పొలంలో విత్తనాలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన కోటం విష్ణు, పకీరప్పలు మరో 18 మందితో కలిసి రవిపై దాడి చేసి హత్యాయత్నానికి యత్నించారని వివరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్టు చేయలేదన్నారు. దళిత రైతుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, గ్రామస్తులు పాష, మహిపాల్ తదితరులు ఉన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు