50శాతం రిజర్వేషన్లు కల్పించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్
బంట్వారం: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్‌యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం బంట్వారంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో బీసీలకు రాజకీయంగా కనీస ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణంకాల ప్రకారం చట్ట సభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాట లేదన్నారు. దేశ జనాభాలో 56 శాతంబీసీలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కనినిస్తుందని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రధానిని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యంగ బద్దమైన హక్కులు కల్పించాలన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లపై త్వరలోనే వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.


