
స్టయిఫండ్ చెల్లించాలంటూ ధర్నా
● విధులు బహిష్కరించి నిరసన తెలిపినహౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు స్టయిఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా కళాశాల యాజమాన్యం స్టయిఫండ్ చెల్లించడం లేదని పేర్కొన్నారు. జీవో నంబర్ 59, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్లకు నెలకు రూ.25,906, పీజీ విద్యార్థులకు రూ.58.289 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ కళాశాల యాజమాన్యం నాలుగు నెలలుగా ఈ మొత్తం ఇవ్వడం లేదన్నారు. వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.