
దరఖాస్తుల ఆహ్వానం
ట్రయినీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి
అనంతగిరి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) తెలంగాణ వారి ఆధ్వర్యంలోని వివిధ క్రీడా అకాడమీ మరియు వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి గాను అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ విభాగాల్లో బాలబాలికల ప్రవేశాల కోసం ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అర్హులైన, ఆసక్తి గల బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చదువుతున్న స్కూల్, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్ ఫోర్టు సైజ్ ఫొటోలు, ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఉదయం 7గంటలకు ఎంపిక ప్రదేశాలకు హాజరు కావాలన్నారు. వాలీబాల్‌కు సంబంధించి జూన్ 1 సిద్దిపేట జిల్లా వాలీబాల్ అకాడమీలో, జూన్ 10న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో, రాజన్న సిరిసిల్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీలో, జూన్ 12, 13న మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియం మైదానంలో, ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జూన్ 10, 11న సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ వెలోడ్రోమ్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్, ప్రాంతీయ క్రీడా వసతి గృహం, హన్మకొండలో, జూన్ 10, 11 తేదీల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్ జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ, హన్మకొండలో ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 12న హాకీ అకాడమీ, వనపర్తి డా.బాలకృష్ణయ్య మినీ స్టేడియం, వనపర్తిలో హాకీ ఎంపిక అదేవిధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఖమ్మంలో జూన్ 12న అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10 నుంచి 12 సంవత్సరాల వారికి జిమ్నాస్టిక్ మరియు స్విమ్మింగ్ ఎంపిక, 12 నుంచి 16 సంవత్సరాల వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్ విభాగాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు.