
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ● బిక్కరెడ్డి గూడెంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన ● పలు గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభం
మోమిన్‌పేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.15 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. బిక్కరెడ్డి గూడెంలో రూ.3 కోట్లతో బీటీ రోడ్డు పనులకు, మల్లారెడ్డిగూడెం చెరువు, ఎన్కతల పెద్ద చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. మోమిన్‌పేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన పేదలందరికీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు దశల వారీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదట సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా బిక్కరెడ్డిగూడెంకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.3 కోట్లతో బీడీ రోడ్డు వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, పీఆర్ ఏఈఈ ప్రణీత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు నరోత్తంరెడ్డి, సురేందర్, శుభాష్‌గౌడ్, సిరాజొద్దీన్, మహంత్‌స్వామి, ఎజాస్, ఎరాజ్ తదితరులు పాల్గొన్నారు.