
నియంతృత్వ విధానాలపై ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం: ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్‌నే తరిమికొట్టిన పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. హిట్లర్ ఫాసిజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాలను అక్రమించుకోవాలన్న కుట్ర, కుతంత్రాలతో నియంత హిట్లర్ సాగించిన దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్టవేసిందన్నారు. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తూ రష్యాను సైతం ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నానికి 1945లో కమ్యూనిస్టు సైన్యం అడ్డుకట్టవేసి సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను సీపీఎం ఖండిస్తుందన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని జాన్‌వెస్లీ అన్నారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
ఈనెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈనెల 30న వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టే ధర్నాలకు సైతం మద్దతు ఉంటుందని తెలిపారు. రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో సీపీఎం శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామేల్, జగదీశ్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్ తదితరు పాల్గొన్నారు.
యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ