
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
తాండూరు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలక్ష్మి
బషీరాబాద్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తాండూరు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆమె స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిల్లు చేయడానికి ముహూర్తాలు పెడుతున్నారన్నారు. అలాంటి పెళ్లిళ్లపై అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. తాండూరు నియోజకవర్గంలో నెల రోజులుగా మొత్తం తొమ్మిది చైల్డ్ మ్యారేజీలను అడ్డుకున్నట్లు తెలిపారు. మరో రెండు వివాహాల విషయంలో పోలీసు కేసులు పెట్టినట్లు చెప్పారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బాల్య వివాహాలతో ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద వచ్చే ఆర్థిక సాయం అందదని చెప్పారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైన బలవంతంగా బాల్య వివాహం చేయాలని నిర్ణయిస్తే టోల్ ఫ్రీ నంబర్స్ 1098 లేదా 181 కాల్ చేసి సమాచరం ఇవ్వాలని సూచించారు.