
మండేకాలం.. పశువులు భద్రం
అప్రమత్తంగా ఉంటేనే మూగజీవాలు ఆరోగ్యం
● వేడి గాలులతో జాగ్రత్త
● పశు వైద్యుల సూచన
తాండూరు: పక్షం రోజులుగా ఎండలతో పాటు వేడి గాలులు జన జీవనంతో పాటు పశువులను ఊపిరాడకుండా చేసున్నాయి. వేడి ఎక్కువైన ప్రజలు ఫ్యాన్ లేదా కూలర్లతో సేదదీరుతారు. మరీ ఇబ్బంది పడితే ఏసీలో చల్లగా గడిపేస్తారు. కానీ పశువులు మాత్రం మండే ఎండలకు అనారోగ్యబారిన పడుతున్నాయి. వాటిని పోషకులే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండక పోతే అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చడంతో మూగజీవాలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి మృత్యువాత కూడా పడతాయి. పశువులు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన మెళకువలు, చికిత్స వివరాలను పశువైద్యాధికారులు వివరించారు.
వడదెబ్బ
వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మెదడులో హైపోథలామస్ అనే భాగం స్వేద గ్రంథులు చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. చెమట ద్వారా శరీరంలోని ధాతువులు కోల్పోయి జీవక్రియ దెబ్బ తింటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడి, మూత్ర పిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారుతుంది. శ్వాస సరిగా అందక మరణించే అవకాశాలు లేకపోలేదు.
లక్షణాలు
పశువులలో శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల సెల్సీయస్ మించితే చర్మం మృధుత్వం తగ్గిపోయి, గట్టి పడుతుంది. నోటితో గాలి పీల్చుకోవడం, నోటి వెంకట చొంగ కారడం జరుగుతుంది. ఆవుల్లో పాల దిగుబడి పునరుత్పత్తి, గర్భస్రావం అయ్యే అవకాశం ఉండగా, ఎత్తులో వంధత్వం వస్తుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు పక్షవాతం, లక్షణాలు సంభవించి క్రమంగా కోమాలోకి వెళ్లి మరణిస్తాయి.
కారణాలు
● గాలిలో తేమ అధికంగా ఉండటం
● వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం
● పాకలో సామర్థ్యానికి మించి పశువులు ఉండటం
● నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు
● వడగాలులతో పశువులు ఒత్తిడికి లోను కావడం వల్ల
చికిత్స
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్‌లు లేదా కూలర్‌ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయంలో పశువులను చల్లని నీటితో పలు మార్లు కడగాలి. నీటిని తాగడానికి అందుబాటులో ఉంచి నొప్పులను తగ్గించడానికి మందును వాడాలి.
నివారణ చర్యలు
● వేసవిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పశువులను మేతకు బయటకు వదలకూడదు.
● చల్లని నీరు తాగేందుకు పాకాలో అందుబాటులో ఉంచాలి.
● రోజుకు 3 లేదా 4 సార్లు చల్లని నీటితో పశువులను కడగాలి. లేదా చెరువులలో నీరు నిల్వ ఉన్న కుంటలలో పశువులను వదలాలి.
● కొట్టాలను బాగా ఎత్తుగా నిర్మించుకొని పైన ఎండుగడ్డితో కప్పాలి. ఎండ ఉన్న సమయంలో పశువులపై నీటిని చల్లుతుండాలి.
● పశువుల పాకలో వడగాలి వీస్తున్న దిక్కులలో గోనే సంచులను కట్టి నీరు చల్లుతుండాలి.
● నీటి శాతం అధికంగా ఉన్న పచ్చి మేతను పశువులకు వేయాలి.
● ఎక్కువగా దాణా లేదా ఉడికించిన ధాన్యాలను పెడుతున్నప్పుడు కొంచెం వంట సోడా కలపడం వల్ల ఎండ వేడిమికి గురైన పశువుల్లో వచ్చే అజీర్తి సమస్యను నివారించవచ్చు.