షాద్‌నగర్‌రూరల్: ప్రియురాలు చనిపోయిందని మనస్తాపం చెందిన ప్రియుడు.. ఆమె లేని జీవితం వ్యర్థమని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు.. షాద్‌నగర్ పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ముగిసినప్పటికీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు తరువాత వెళ్తానని హాస్టల్ అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా.. చందు ప్రేమించిన యువతి నెల రోజులు క్రితం చనిపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన అతను.. తొలుత వసతిగృహం గదిలో ఉరి వేసుకునేందుకు ఫ్యాన్‌కు బెడ్ షీట్‌ను కట్టాడు. ఏమైందో ఏమోకాని.. ఆ తరువాత హాస్టల్ భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే హాస్టల్ అధికారులకు, ఇతర విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాయాలతో పడున్నచందును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. యువకుడి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎడమ చేయి విరిగిందని తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్సకోసంచందును.. కుటుంబీకులు ప్రైవేట్ హాస్పిటల్‌కుతరలించారు. ప్రేమించిన యువతి మరణంతో మనస్తాపం చెంది, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పరీక్షలు సరిగా రాయలేదని చందు సోదరుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భవిష్యత్ ఆగం చేసుకోవద్దు
ప్రేమ పేరుతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఇంటర్ విద్యార్థి చందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందును ఆయన ఆదివారం పరామర్శించి మాట్లాడారు. తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా.. వారి కలలను సాకారం చేసేందుకు విద్యావంతులుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వసతిగృహాన్ని పరిశీలించారు.
● ప్రియురాలు చనిపోయిందనిప్రియుడి ఆత్మహత్యాయత్నం
● గాయాలతో చికిత్స పొందుతున్నయువకుడు