తిరుపతి జిల్లా అదనపు ఎస్పీగా శ్రీనివాసులు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లా అదనపు ఎస్పీగా శ్రీనివాసులు

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

● అర్హులు 1,65,689 మంది

తిరుపతి క్రైమ్‌ : తిరుపతి జిల్లా అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో తిరుపతి జిల్లాలో అదనపు ఎస్పీ (క్రైమ్స్‌)గా విధులు నిర్వహించిన ఆర్ల శ్రీనివాసులు, తాజాగా అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

7 నుంచి బీఈడీ పరీక్షలు

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో బీఈడీ చదువుతున్న విద్యార్థులకు సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ రాజామాణిక్యం తెలిపారు. విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

నేడే అన్నదాత సుఖీభవ

తిరుపతి అర్బన్‌: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు విడతల్లో భాగంగా తొలి విడతగా శనివారం పీఎం కిసాన్‌ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.5వేలు మొత్తం రూ.7 వేలు రైతు ఖాతాల్లో జమ కానుంది. ఈ మొత్తాన్ని శనివారం జిల్లాలో అర్హులైన 1,65689 మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. 2023–24లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1,80,654మంది అన్నదాతలకు రైతు భరోసా అందించింది. కూటమి ప్రభు త్వం వచ్చాక వివిధ కారణాలు చూపి అందులో 57,098 మందికి కోత విధించింది. ప్రతి రైతుకూ రూ.20 వేలు అని చెప్పి అందులో సవాలక్ష కొర్రీలు విధిస్తోంది. కాకిలెక్కలతో అన్నదాతలను బోల్తాకొట్టిస్తోంది.

సమగ్ర నివేదిక అందిస్తాం

తిరుపతి అర్బన్‌: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబందించి సమగ్ర నివేదికను అందిస్తామని రిటైర్డ్‌ ఐఏఎస్‌, డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రా వెల్లడించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ చాంబర్‌లో బీసీ నేతలు, సంఘాలకు చెందిన ప్రతినిధులతోపాటు సాధారణ వ్యక్తులు అందించిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నుంచి స్థానిక సంస్థల్లో రిజక్వేషన్లకు సంబంధించి అర్జీల సేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, బీసీ వెల్పేర్‌ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

రేణిగుంటలో డెడికేటెడ్‌ కమిషన్‌

రేణిగుంట: డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా శుక్రవారం రేణిగుంటలో పర్యటించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి.. మండలంలో జరిగిన సర్వేపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం బుగ్గ వీధిలో ప్రజల వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీని పరిశీలించారు. జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు, డీపీఓ సుశీలాదేవి, డీఎల్‌డీఓ గంగాభవానీ, ఎంపీడీవో రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు పాల్గొన్నారు.

పది సప్లిమెంటరీలో

83.87 శాతం ఉత్తీర్ణత

తిరుపతి అర్బన్‌: పదో తరగతి అడ్వాన్డ్‌స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 83.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం ఫలితాలు విడుదల చేయగా.. 4,556 మంది విద్యార్థులకు గాను 3,821 మంది ఉత్తీర్ణత సాధించారు. మళ్లీ 735 మంది ఫెయిలయ్యారు. వీరు ఈ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సార్వత్రిక విద్యాపీఠంకు సంబంధించి 480 మంది విద్యార్థులకు గాను 428 మంది ఉత్తీర్ణత సాధించారు.

యోగా డే రేపు

తిరుపతి అర్బన్‌: అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లా స్థాయిలో యోగా డే నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆదివారం జాతీయ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6.30 నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement