తిరుపతి అర్బన్: పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీ పుత్రుడుగా ఖ్యాతి చెందారని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, నాట్యంలో అపార ప్రతిభ చూపాలని వెల్లడించారు. అనేక భాషల్లో పాండిత్యం సంపాదించి అనేక నవలలు, నాటకాలు, కావ్యాలు రచించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు.
ఆక్రమణలు లేవు.. పట్టా భూములే!
రేణిగుంట: మండలంలోని కొత్తపాళెం రెవెన్యూ లెక్క దాఖలాలో ఓ ప్రైవేటు వెంచర్‌లో పలు సర్వే నంబర్లులోని 8.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు వెంచర్లలో కలుపుకున్నారన్నది అవాస్తవమని దివంగత శేషారెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ వెంచర్ మధ్యలోని అనాధీనం భూములను మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్లు అధికంగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించి క్రమబద్ధీకరించుకున్నట్లు వివరించారు. దీంతోనే తమకు 0.67 సెంట్లు విస్తీర్ణంలోని కొంత భూభాగం తమకు అధికారికంగా సంక్రమించిందన్నారు. ప్రభుత్వం తమ భూముల్లోని 0.955 సెంట్లు రోడ్డు, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుని ఇప్పటివరకు తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. పసల మునిరెడ్డి అనే వ్యక్తి దురుద్దేశంతో తమ వెంచర్‌పై అసత్య ఆరోపణలు చేశారని, అలాంటివి నమ్మవద్దని కోరారు.
అక్రమ కేసులపై
విచారణ చేపట్టండి
పుల్లంపేట:దళితులపై నమోదుచేసిన అక్రమ కేసులపై విచారణ జరిపి న్యాయం చేయాలని మండల పరిధిలోని వత్తలూరు గ్రామపంచాయతీకి చెందిన దళితులు పోలీసులను కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు యథేచ్ఛగా కొనసాగడమే కాకుండా దళితుల ఆస్తులకు భరోసా లేదని వారు వాపోయారు. వత్తలూరు రెవెన్యూ పరిధిలోని పర్వేనంబరు 1042, 1053, 1055లలో 2012వ సంవత్సరం నుండి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. సంబంధిత భూములకు సంబంధించి 2024లో మాపేర్లతో అసైన్‌మెంట్ కమిటీలో నమోదు చేయబడ్డాయని తెలిపారు. అనివార్య కారణాలతో అప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టరు అసైన్‌మెంట్ కమిటీని రద్దు చేశారని వారు పోలీసులకు వివరించారు. ఆయా వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి తమపై నమోదు చేసిన కేసులను పునర్విచారించి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వత్తలూరు గ్రామానికి చెందిన బాధిత దళితులు పాల్గొన్నారు.


