వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఊంజల్ సేవ కీర్తనల నడుమ కమనీయంగా సాగింది. శనివారం వేకువ జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి, నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ఉభయ నాంచారుల సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామిని, పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి ఉయ్యాలలో కొలువు దీర్చారు. అన్నమయ్య కీర్తనల నడుమ ఊంజల్ సేవ కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఉభయ దేవేరులతో కలసి తిరుచ్చి వాహనం అధిరోహించిన శ్రీవారు మేళతాలాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు నారికేల, కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. భక్తులను కటాక్షించి ఆలయం చేరుకొన్న స్వామి, అమ్మవార్లకు మంగళహారతులిచ్చి పవళింపు సేవ నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారి వేణుగోపాల్ పర్యవేక్షించారు.
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల:చందనా బ్రదర్స్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,01,116 విరాళంగా అందించింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన క్రెడ్‌వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది. ఈ మేరకు క్రెడ్‌వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు విరాళం డీడీలను తిరుపతి లోని ఈఓ బంగళాలో టీటీడీ ఈఓ ఎం.రవిచంద్రకు అందజేశారు. చందనా బ్రద ర్స్ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
గంజాయి విక్రేత అరెస్టు
– 1.8 కేజీల గంజాయి స్వాధీనం
తిరుపతి రూరల్: తిరుపతి నగరంతోపాటు నగర శివార్లలో గుట్టుగా గంజాయి విక్రయించే వ్యక్తిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు అతని నుంచి 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి మాట్లాడారు. తిరుపతి పరిసరాల్లోని కాలేజీలు, హాస్టళ్లు వద్ద కుర్రాళ్లకు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్టు రహస్య సమాచారం రావడంతో నిఘా పెట్టామన్నారు. ఎంకేనాయుడు కాలనీ సమీపంలోని అవిలాల క్రాస్ వద్ద సాయిప్రసాద్ అనే యువకుడు 10గ్రాముల గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. అతనిని విచారించారు. సాయిప్రసాద్ స్నేహితుడైన గౌరీశంకర్‌తో కలిసి ఒడిశా రాష్ట్రం, బరంపురం నుండి గంజాయి తీసుకువచ్చి తిరుపతిలోని విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు అంగీకరించాడరన్నారు. 10గ్రాముల గంజాయి ప్యాకెట్టు రూ.500కి అమ్ముతున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. అతని వద్ద అమ్మకానికి సిద్ధంగా పెట్టుకున్న 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయన్నారు.


