చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది! | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది!

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

సత్యవేడు: కడుపున పుట్టిన చిన్నారి ప్రాణాన్ని కన్నతల్లే చిదిమేసింది. చంటిపాపను చంపిన కేసులో నిందితురాలు తల్లి హేమావతి(28)ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో సీఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో నిందితురాలు హేమావతిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తల్లి తన నవశిశువును చంపిన కేసుకు సంబంధించి వివరాలను సీఐ వెల్లడించారు. సరసరాజు అగ్రహారంలోని పద్మప్రియ ఇంటి సముదాయంలో మొదటి అంతస్తులో వెంకటేష్‌, హేమావతి దంపతుల కుటుంబం నివశిస్తోంది. ఆరు నెలల క్రితమే వీరు తమిళనాడు, చిన్న బొమ్మాజిగుంట గ్రామం నుంచి దళవాయి అగ్రహారం వచ్చారు. సమీపంలోని సిమెంటు ఇటుకుల తయారీ కేంద్రంలో వెంకటేష్‌ పనిచేస్తున్నాడు. వీరికి వృతిక్‌(5) అనే కుమారుడు ఉన్నాడు. దళవాయి అగ్రహారం వచ్చాక ఆడబిడ్డ జోవిక జన్మించింది. కుమార్తె జన్మించిన తరువాత తల్లి హేమావతి ఇంట్లో పని ఒత్తిడితో అధిక కోపం ప్రదర్శిస్తూ ఇంట్లో పాత్రలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పగులగొట్టేది. బిడ్డ తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెంది కూతురుని ఎక్కడైనా వదిలేసి వచ్చేయాలని పలుసార్లు భర్తకు చెప్పేది. మార్చి 26వ తేదీ ఉదయం 7 గంటలకు పాప పాలకోసం ఏడవడం మొదలు పెట్టింది. ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో ఆమె తన కూతురు జోవికకు శ్వాస ఆడకుండా ముక్కు, నోరు మూసి పట్టుకోవడంతో పాప చనిపోయింది. దీనిపై భర్త వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు స్ధానిక ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి కేసు నమోదు చేశారు. కేసు విచారణను సీఐ మురళీనాయుడు చేపట్టారు. గ్రామ పెద్దలు హేమావతిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడంతో మార్చి 27వ తేదీ రాత్రి నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు సాయినాథ్‌చౌదరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement