గుంట..గుటుక్కు | - | Sakshi
Sakshi News home page

గుంట..గుటుక్కు

Mar 28 2026 7:12 AM | Updated on Mar 28 2026 7:12 AM

● అక్రమార్కుల చెరలో అత్తికుంట ● కుప్పం బాదూరులో సాగు, తాగునీటి కుంటల ఆక్రమణ ● చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

చినుకు జాడ లేక జలవనరు చావుకు దగ్గరవుతున్నాయని కర్షకులు ఆవేదన చెందే రోజులు పోయాయి.. చినుకు మాట దేవుడెరుగు.. అసలు జలవనరులే మాయమవుతున్నాయి.. రాజకీయదన్నుతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. గ్రామస్థాయి ‘పచ్చ’ నేతలు వీటిపై కన్నేయడంతో కుంటలు కనుమరుగవుతున్నాయి.

రామచంద్రాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలో ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా పచ్చ తమ్ముళ్లు పాగా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భూబకాసురులు బరితెగించి, విలువైన సాగు, తాగునీటి వనరులు, పర్యావరణానికి పట్టుకొమ్మలైన పచ్చని కొండలను కబళిస్తున్నారు. తాజాగా కుప్పంబాదూరు పరిధిలోని అత్తికుంట అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న చందంగా పచ్చ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

అంచలంచెలుగా చదును

మండలంలోని కుప్పంబాదూరు లెక్కల దాఖలాలోని 133/8 సర్వే నంబర్‌లో ఉన్న 2.50 ఎకరాల కుంట తిరుపతి, పచ్చికాపలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. అయితే కొందరు స్థానిక కూటమి నేతలు యంత్రాలతో అవకాశం ఉన్నప్పుడల్లా అంచలంచెలుగా చదును చేసుకుని, ఆక్రమిస్తున్నారు. ఇటీవల రాత్రి వేళలో దుకాణ గదుల నిర్మాణం చేపట్టారు. సాగునీటి కుంటను ఆక్రమణలకు పాల్పడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పొంచివున్న ముప్పు

రాయలచెరువు నిండిన ప్రతిసారీ మొరవ గండి కొట్టి అదనపు జలాలను అత్తికుంటకు మళ్లిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ కుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు కురిసి రాయలచెరువు నిండితే, ఆ నీరు అత్తికుంటలోకి వెళ్లలేక చుట్టుపక్కల ముంపునకు గురవడంతోపాటు చెరువు కట్ట తెగితే కింద ఉన్న పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని, గతంలో భారీ వర్షాలకు చెరువు నిండినప్పుడు ఈ మార్గంలో గండి కొట్టి నీటి ప్రవాహాన్ని మళ్లించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

రెవెన్యూ మౌనం, నాయకుల అండ

ఈ అక్రమాలపై స్థానిక గ్రామస్తులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి, స్థానిక కూటమి నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటానికే భయపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో, పచ్చ పార్టీ నేతలకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని మండల ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

రైతుల ఆవేదన

ప్రధాన రహదారికి అనుకుని బహిరంగంగా ఆక్రమణలు జరుగుతుంటే మండల రెవెన్యూ అధికారి తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందిస్తున్న కుంటలను ఇలా ఆక్రమించుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వస్తే ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని పరిసర ప్రాంతాల రైతులు కోరుకుంటున్నారు.

విడతల వారీగా కుంటను పూడ్చేస్తున్న అక్రమార్కులు

క్షేత్రస్థాయిలో పరిశీలించి.. చెబుతాం

ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో సమాచారం లేదు. వీఆర్‌ఏ లేనందున క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారికి సమాచారం అందించి, అధికారికంగా చర్యలు తీసుకుంటాం.

– రాజశేఖర్‌, వీఆర్వో, కుప్పంబాదూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement