అన్నదాతకు రాయితీ దూరం
రేట్లు ఎక్కువగా ఉన్నాయని విత్తనాలు ఎగనామం దశాద్ధాలుగా చూస్తే ఎగ్గొట్టడం ఇదే తొలిసారి
ప్రభుత్వం రైతులకు ఏదైనా మేలు చేస్తుందంటే అది రాయితీ విత్తనాల పంపిణీ మాత్రమే. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని కర్షకులకు ఏటా రబీలో ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేసేది. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నాయని, బాబు సర్కారు రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియను ఆపివేసింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు విత్తన కాయలకు అధిక ధరలు వెచ్చించలేక ఆ పంటకు దూరం అయ్యారు.
తిరుపతి అర్బన్: వేరుశనగ పంటకు తిరుపతి జిల్లా పెట్టిన పేరు. దూర ప్రాంతాల నుంచి సైతం వేరుశనగ కాయలు కావాలంటే తిరుపతి జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబద్దాలుగా ఏటా రబీ సీజన్‌లో 55 నుంచి 60 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇచ్చేవారు. అయితే ఈ రబీ సీజన్‌లో విత్తనాలు రేట్లు అధికంగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీ విత్తనాలు ఇవ్వాలేమని వ్యవసాయాధికారులకు సందేశం చేరవేసినట్లు తెలుస్తోంది.
వేరుశనగ పంట దూరం...
జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, మామిడి, చెరుకు అధికంగా సాగు చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు పాలనలోనే చెరుకు బకాయిలు ఇవ్వకుండా కొందరు ఫ్యాక్టరీలు యజమానులు రైతులను ఇబ్బందులు పెట్టడంతో జిల్లాలో చెరుకు సాగు పూర్తిగా కనుమరుగైంది. మరోవైపు బాబు పాలనలోనే ఈ ఏడాది మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో మామిడి పంట సాగు సైతం తరిగిపోతోంది. తాజాగా ఆయన పాలనలోనే రాయితీతో రైతులకు ఇవ్వాల్సిన వేరుశనగ విత్తనాలు ఎగనామం పెట్టడంతో ఈ పంట సైతం జిల్లాలో దూరం అవుతుంది. రాయితీ విత్తనాల పంపిణీ ఆపి వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మిగిలిన పంట కేవలం వరి మాత్రమే. అయితే యూరియా ఇబ్బందులతో ఆ పంట సైతం చంద్రబాబు పాలనలో దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. గత ఏడాది రాయితీ వేరుశనగ కాయలను టీడీపీ నేతలు పెద్ద మొత్తంలో తీసుకుని జిల్లాలో తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతోనే ఈ సీజన్‌లో ఆపివేశారని కొందరు, ధరలు పెరుగుదలతోనే రాయితీ ఇవ్వలేక ఆపివేసినట్టు మరి కొందరు చర్చించుకుంటున్నారు.
అనంతపురం కదిరి ప్రాంతంలో టాగ్ 24 రకం, కే6, జేఎల్ 26 రకాల వేరుశనగ కాయల బస్తా(50కిలోలు) రూ.5500 నుంచి రూ.6 వేలకు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ 55 నుంచి 60 శాతంతో ఇచ్చి ఉంటే బస్తా రూ.2300 నుంచి రూ.2500కు వచ్చేది. చంద్రబాబు సర్కార్ వేరుశనగ పంపిణీ ఎగనామం పెట్టడంతో ఈ పంట జిల్లాలో సాగుకు దూరమైంది.కాగా వేరుశనగ రాయితీ విత్తనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గత నెల నవంబర్ 15 నుంచి ఈ నెల 15 వరకు వేరుశనగ పంట సాగు చేసిన రైతులు ఎకరం పంటకు బీమా ప్రీమియం రూ.450 చెల్లించాలని తెలపడం విడ్డూరంగా ఉంది.


