ఎర్రచందనం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న కేసులో నలుగురికి ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, కోర్టు కానిస్టేబుల్ నరసింహులు కథనం మేరకు.. 2017 ఆగస్టు ఏడో తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భాకరాపేట స్టేషన్ పోలీసులకు అందిన సమాచారంతో వారు చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట, దేవరకొండ రోడ్డు, విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరిగెత్తడానికి ప్రయత్నించారు. పోలీసులు కలికిరి మండలం, గుట్ట పాళెం సమీపంలోని అచ్చర్ల గొల్లపల్లికి చెందిన ఎన్.రెడ్డెప్ప, పి నాగరాజ అలియాస్ గోవింద్, ఎర్రావారిపాళెం మండలం, బుగ్గలవారిపల్లి హరిజనవాడకు చెందిన ముడిమి చెంగయ్య, అదే మండలం, గొల్లపల్లికి చెందిన బి.వెంకటాద్రి అలియాస్ చిన్నను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉన్న సమీపంలోని పొదల్లో దాచిన 44 కిలోల నాలుగు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నలుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు.
మరో కేసులో ఇద్దరికీ మూడేళ్లు..
ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరికీ మూడేళ్లు చొప్పున జైలుశిక్ష , ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. 2009 ఆగస్టు ఒకటో తేదీ కడప ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది బద్వేలు రేంజ్ పరిధిలోని సోమిరెడ్డిపల్లి వ్యవసాయ భూముల్లో తనిఖీలు చేసి 201 కిలోల బరువున్న ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, బి మఠం మండలం, లింగాల దిన్నిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కత్తి గురుమూర్తి, అదే మండలం, సోమశెట్టిపల్లికి చెందిన డేరింగ్ ల సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


