అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద ఉన్న చిన్న గది నుంచి శుక్రవారం కుళ్లిన వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉండడాన్ని చూసిన స్థానికులు ఈ నెల 16వ తేదీన పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్‌ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురు స్కూటర్ వద్ద దొరికిన ఆధార్‌కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్‌గా పని చేసేవాడు. ఈ నెల 15వ తేదీ రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. మృతుడు ఫూటుగా మద్యం తాగి స్కూటర్‌పై పడిపోవడంతో దెబ్బలు తగిలి 50 అడుగుల దూరంలో ఉన్న ట్యాంకు గదిలోకి వెళ్లి ఉండవచ్చని, అక్కడే అతను మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగమంజుల తెలిపారు.


