ఇద్దరు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
4 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట: అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో విక్రయించే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఈ వివరాలను వెల్లడించారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు రేణిగుంట సంత వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద నల్ల కవర్‌లో నాలుగు కిలోల గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుమల బాలాజీ నగర్‌కు చెందిన మేలపాటి యశ్వంత్, తిరుపతి బీటీఆర్ కాలనీకి చెందిన మల్లెల సూర్యగా గుర్తించామని డీఎస్పీ అన్నారు. అరకు ప్రాంతానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకువచ్చి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వారు విచారణలో తెలిపారన్నారు. నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.


