త్రుటిలో తప్పిన ప్రమాదం
తడ : కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై మూడు బైకులను ఢీకొట్టిన ఘటనలో నలుగురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గురువారం కాదలూరు గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బూదూరు నుంచి మాంబట్టు సెజ్‌లోని పరిశ్రమకు కార్మికులను తీసుకొస్తున్న బసు ప్రమాద స్థలం వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ముందు ఆగి ఉన్న మూడు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరవారిసత్రం మండలానికి చెందిన రమేష్, యమున, సంపూర్ణతో పాటు మరో మహిళ గాయపడ్డారు. వీరంతా కూడా అపాచీ పరిశ్రమలో పని చేస్తూ విధులకు హాజరయ్యేందుకు బైక్‌లపై వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రులు సూళ్లూరుపేటలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా కొట్టే ప్రమాదం నుంచి తృటిలో తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారు.


