పేదల స్థలాలను దోచేస్తారా ?
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో 1.09 ఎకరాల మఠం భూమిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. సీపీఎం మండల కన్వీనర్ వేణు మాట్లాడుతూ.. గాంధీపురానికి చెందిన 32 రజక కుటుంబాల వారు ఇంటి నిర్మాణాల కోసం కొనుగోలు చేస్తే ఆ భూములు దోచేసి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి పేదల జాగాల్లో పాగా వేసేందుకు ప్రయత్నించే రామసుబ్బారెడ్డితో పాటు అతనికి అండగా నిలబడ్డ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మఠం భూముల్లో
144 సెక్షన్ అమలు చేయాలి
భూ ఆక్రమణ దారుల ఆగడాలతో మఠం భూమిలో అల్లర్లు చెలరేగుతున్నాయని, గంజాయి మత్తులో యువత భయబ్రాంతులకు గురిచేస్తున్నందున అక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మఠం భూములను పరిరక్షించడంతో పాటు ఆ మఠం భూమి తమదేనని అమాయకులను మోసం చేసి డబ్బులకు విక్రయించిన వ్యక్తులపై కేసు పెట్టాలని, లేని పక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహన్‌ను కలిసి వినతి పత్రం అందించి బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు వేణు, సుబ్రమణ్యంలతో పాటు 32 బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.
కేసు నమోదు చేయాలి
మఠం భూములను అడ్డంగా అమ్మేస్తున్న భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై భూ ఆక్రమణ నిరోదక చట్టం కింద కేసు నమోదు చేయాలి. స్థానికులపై దాడులకు తెగబడుతున్న కడప జిల్లా వాసులను అక్కడి నుంచి తరిమివేయాలి. డబ్బులు పెట్టి స్థలం కొనుగోలు చేసిన బాధితులు అందరికీ న్యాయం చేయాలి.
– మహేష్, రజకసంఘం నాయకుడు,
గాంధీపురం
పేదల స్థలాలను దోచేస్తారా ?


