లారీ డ్రైవర్ కుమార్తెకు ఐఈఎస్
తిరుపతి సిటీ: తిరుపతి సింగాలకుంటకు చెందిన లారీ డ్రైవర్ కృష్ణమూర్తి కుమార్తె దాసరి ఇందుమతి అరుదైన లక్ష్యాన్ని సాధించారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌లో దేశంలోనే అత్యుత్తమ పరీక్షగా పేరుగాంచిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో 75వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. తొలి ప్రయత్నంలోనే ఆమె ఈస్థాయికి చేరుకోవడంపై జిల్లా వ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారని ఆయన కష్టాలను గమనించి ఎలాగైనా ఐఈఎస్ సాఽధించాలని పట్టుదలతో పరీక్షకు సన్నద్ధం అయ్యానని తెలిపారు.
21న తిరుమలలో పల్స్ పోలియో
తిరుమల:తిరుమలలో 21వ తేదీ పల్స్ పోలియో సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సీఆర్‌ఓ, పీఏసీ 1, 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1,2 ఏటీసీ, ఎంబీసీ–34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల , వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు.
నేడు ఇంటర్ పరీక్షలపై అవగాహన
తిరుపతి సిటీ : నూతన సిలబస్, సరికొత్త పరీక్షా విధానంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు అవగాహన కల్పించనున్నట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తిరుచానూరులో శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పరీక్షా సెంటర్ల ఇంచార్జిలు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో కడప ఆర్జేడి సురేష్‌బాబు, ఇంటర్మీడియట్ విద్యామండలి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణిక్యుడు పాల్గొంటారని తెలియజేశారు.
మెగా జాబ్ మేళాకు స్పందన
తిరుపతి తుడా : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతంలోని తిరుపతి కార్పొరేషన్, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి , సూళ్లురుపేట , వెంకటగిరి మున్సిపాలిటీల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జాల ఎఫ్రాయిమ్ తెలిపారు. గరువారం తిరుపతి తుడా కార్యాలయంలో జరిగిన జాబ్ మేళాలో మహిళా సంఘాల, సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేళా నిర్వహించామన్నారు. ఇందులో సుమారు 454 మంది హాజరు కాగా అందులో 117 మందికి ఉద్యోగాలు పొందారన్నారు. కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి లోకనాథం, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
శాస్త్రాలపై పట్టు సాధించాలి
తిరుపతి సిటీ : విద్యార్థి దశ నుంచే శాస్త్ర సంరక్షణ, శాస్త్రలపై పట్టు సాధించాలని స్వర్ణవల్లీ మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీగంగాధరేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీమదానంద బోధేంద్ర సరస్వతీ స్వాములు సూచించారు. గురువారం జాతీయ సంస్కృత వర్సిటీలో పరమాచార్య గురుకుల కేంద్రం, పలు వాక్యార్థ సభలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రాల పఠనంతో విశేష జ్ఞానం సొంతమవుతుందన్నారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. శాస్త్ర విషయాలు, సంస్కృతిని సంరక్షించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరమాచార్య గురుకుల కేంద్ర డైరెక్టర్, అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు గణపతి భట్, డీన్ రజనీకాంత్ శుక్ల, ఐక్యూఏసీ డైరెక్టర్ సతీష్, గోవింద వాక్యార్థ సభ కో ఆర్డినేటర్లు శ్రీహరి దాయగుడే, మనోజ్ షిండే, కులపతి వాక్యార్థసభ కోఆర్డినేటర్లు శంకర నారాయణ, భరత భూషణ్ త్ , పలు విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లారీ డ్రైవర్ కుమార్తెకు ఐఈఎస్
లారీ డ్రైవర్ కుమార్తెకు ఐఈఎస్


