తహసీల్దార్, వీఆర్వోల సస్పెన్షన్
తిరుపతి అర్బన్ : పీజీఆర్‌ఎస్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) పిటీషన్లకు సంబంధించి తప్పుదోవ పట్టించారనే నేపథ్యంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని, వీర్లగుణపాడు వీఆర్వో డిల్లెయ్యను సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓజిలి మండలంలోని వీర్లగుణపాడులోని సర్వే నంబర్ 74లో ధనంజయ, వెంకటరమణయ్య అనే రైతులు తమ భూములను అన్‌లైన్‌లో నమోదు చేయాలని పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు పిటీషన్ ఇచ్చారు. అయితే ఆ భూములకు సంబంధించి వాస్తవాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకుండా పిటీషన్‌ను తిరస్కరించకుండా తహసీల్దార్ ఎండార్స్‌మెంట్ చేయడంతో సమస్య నెలకొంది. దీంతో అధికారులు ఈ అంశంపై సీరియస్ అయ్యారు. ఈ అంశానికి తోడుగా వీర్లగుణపాడు వీఆర్వో డిల్లయ్య సదరు సర్వే నంబర్‌లో అక్రమంగా నమోదైందని, బోగస్ అంటూ జనవరిలో ఓ నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత జూన్‌లో ఆ భూమి వారి స్వాధీనంలో ఉందని మరో నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఎంట్రీలు అక్రమంగా ఉన్నాయని, పిటీషనర్ల స్వాఽధీనంలో కాకుండా భూమి ఖాళీగా ఉందంటూ మరో నివేదిక ఇచ్చారు. ఇలా మూడు సార్లు ఇచ్చిన నివేదికల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా చూపించారు. ఈ అంశాన్ని గుర్తించిన సీసీఎల్‌ఏ కమిషనర్ జయలక్ష్మి విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని సస్పెన్షన్ విధించినట్లు ఆమె బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు. మరోవైపు వీఆర్వో డిల్ల్య్యెను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందంటూ అంతా చర్చించుకుంటున్నారు.
తహసీల్దార్, వీఆర్వోల సస్పెన్షన్


