దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమం
తిరుపతి కల్చరల్: సర్వేల పేరుతో పా టు కుంటి సాకులు చూపి, దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తథ్యమని దివ్యాంగుల సేవా సంఘం జేఏసీ రాష్ట్ర నేత కొణతం చంద్రశేఖర్, దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మురళీ గౌడ్ స్పష్టం చేశారు. దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గిరిజన భవన్‌లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ గౌడ్, మురళీతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, సీపీఎం నేత నాగరాజు, రాస్ సంస్థ అధికారి యువరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేసినప్పుడే నిజమైన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ నోటీసులు అందజేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపై నిరసనలు చేయడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. పింఛన్ల జోలికొస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సేవా సంఘం నిర్వాహకులు ఆశాజ్యోతి, దివ్యాంగుల పేద ప్రజల సేవా సంస్థ, హరిత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సోమశేఖర్, శివకుమారి, హరినాథరెడ్డి, వసంత్‌కుమార్, రాజేష్, మాధవన్ పాల్గొన్నారు.


