అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ అభివృద్ధి
తిరుపతి తుడా: దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం స్విమ్స్ ఆస్పత్రిలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు గదులను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తులలో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అలాగే రూ.4.40 కోట్ల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలుగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ పాల్గొన్నారు
క్రెడిట్ చోర్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరిధిలోని ఆస్పత్రులను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించింది. స్విమ్స్ లో రూ.10.65 కోట్లతో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగి సహాయకుల విశ్రాంతి భవనం రూ. 4.40 కోట్లతో పనులను ప్రారంభించింది. 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. ఏడాదిన్నర కాలంలో 10 శాతం పనులు పూర్తి చేసి రంగులు వేసి, తామే అభివృద్ధి చేశామనేలా కలరింగ్ ఇస్తూ ఈ భవనాలను ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ప్రభు త్వం చేసిందంటూ క్రెడిట్ చోర్‌కి పాల్పడ్డారు.


