రూ.కోట్లు వృథా..అంతా వ్యధ
తొట్టంబేడు: కార్యాలయాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలవద్దకే పాలన తెచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు. ఇందులో భాగంగానే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఆయా పంచాయతీల పరిధిలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల నాటికి ఇందులో చాలా వరకు భవనాలు పూర్తి కాగా.. ఆ తర్వాత కొన్ని చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇలాంటిదే తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. రూ.కోటి వ్యయంతో మేజర్ పంచాయతీలైన తంగేళ్లపాళెం, సాంబయ్యపాళెం పంచాయతీల పరిధిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. దాదాపు భవనాలు పూర్తయ్యాయి. రూ.15 లక్షలు వెచ్చిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అవస్థలే..అవస్థలు
తొట్టంబేడు పంచాయతీ తంగేళ్లపాళెంలో 2,500 మంది, సాంబయ్యపాళెం పంచాయతీలో 1800 మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో చాలా మంది రైతులే. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఎరువులు, విత్తనాలతోపాటు ఆరోగ్య అవసరాల నిమిత్తం సుమారు పది కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తికి వెళ్లాల్సి వస్తోంది. వీరి అవసరార్థం గత ప్రభుత్వంలో రూ.కోటి వెచ్చించి రైతు భరోసా, విలేజ్ హెల్త్‌క్లినిక్, సచివాలయం ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు పూర్తికావచ్చాయి. ఫ్లోరింగ్ వేస్తే సరిపోతుంది. వీటికి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. కానీ వీటిని అందుబాటులోకి తెస్తే గత ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందేమోనని కూటమి నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అత్యవసరమైనా.. ఎరువులు అవసరమైనా శ్రీకాళహస్తికి పోవాల్సి వస్తుంది. ఈ భవనాలు అందుబాటులో ఉంటే తమకు ఏ దిగులూ ఉండదని స్థానికులు చెబుతున్నారు.
రూ.కోట్లు వృథా..అంతా వ్యధ
రూ.కోట్లు వృథా..అంతా వ్యధ


